విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, ప్రైవేట్ పాఠశాలలు నేరుగా నోటుపుస్తకాలు, విద్యా సామగ్రిని విక్రయిస్తుండటంతో స్థానిక చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ వ్యాపారాలు కుదేలవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో బుక్ స్టాల్స్ వద్ద కనిపించే సందడి ఈసారి తగ్గిపోయింది. ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత దుకాణాల్లోనే నోటుపుస్తకాలు, స్టేషనరీ వస్తువులను విక్రయించడం, తల్లిదండ్రులను అక్కడే కొనుగోలు చేయమని ఒత్తిడి తేవడం వంటి కారణాలతో స్థానిక బుక్ స్టాల్స్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని వ్యాపారులు తెలిపారు.
జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులు కలిగి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తున్న తమలాంటి చిన్న వ్యాపారులు ఈ పరిస్థితితో తీవ్రంగా నష్టపోతున్నారని, దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏడాది మొత్తం వ్యాపారంలో ఎక్కువ భాగం జరుగుతుంది. ఆ దృష్టితోనే ముందుగానే భారీ మొత్తంలో సరుకును కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నామని, కానీ అమ్మకాలు తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ప్రైవేట్ పాఠశాలల్లో నోటుపుస్తకాల విక్రయాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారుల జీవనోపాధిని పరిరక్షించాలని వారు కోరుతున్నారు.







