దుమ్ముగూడెం మండలంలో పోడు భూముల సాగు చేస్తున్న రైతుల జోలికొస్తే సహించేది లేదని సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శి సాయన్న హెచ్చరించారు. అటవీ అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
దుమ్ముగూడెం మండలంలోని గౌరారం గ్రామంలో తరతరాలుగా పోడు భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులకు అటవీ అధికారుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదని, రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు భద్రాచలం డివిజన్ కార్యదర్శి సాయన్న ఆరోపించారు.
గతంలో కలెక్టర్, ఐటీడీఏ పీఓ పోడు భూములను పరిశీలించి, రైతులకు సూచనలు ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు దాడులు ఆపడం లేదని ఆయన అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఈ సీజన్లో సాగు చేస్తున్న రైతులను అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు.
తాసిల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రం సమర్పించారు. గౌరారం పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, మండలంలో అక్రమంగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్న వ్యక్తులపై, వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.




