చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలోని రైతులకు సోమవారం నుంచి యూరియా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. యూరియా పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా “ఫెర్టిలైజర్” యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్ సూచించారు.
పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, చర్ల, లక్ష్మీకాలనీ, కేశవాపురం, కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లి, మొగళ్లపల్లి, సి.కత్తిగూడెం, కొయ్యూరు, సుబ్బంపేట, ఉప్పరిగూడెం, పూసుగుప్ప పంచాయతీలతో పాటు పెద్దమిడిసిలేరు, ఉయ్యాలమడుగు రెవెన్యూ గ్రామాల రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఫోన్ లేని రైతులు కూడా ఇతరుల మొబైల్ ఫోన్ ద్వారా యాప్‌లో యూరియా బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ చేసుకున్న రైతులు, తమ ఐడీ నంబర్‌ను నమోదు చేసుకుని, ఆధార్ కార్డుతో యాప్‌లో సూచించిన సమయానికి సొసైటీ వద్దకు వచ్చి వేలిముద్ర ద్వారా యూరియాను కొనుగోలు చేయాలి. పట్టాదారు రాలేని పక్షంలో, వారి నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ప్రతినిధి యూరియాను తీసుకెళ్లవచ్చు.
రైతుల మొబైల్ నంబర్లు వ్యవసాయ శాఖ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదై ఉండాలని, లేనిచో యూరియా బుకింగ్ జరగదని స్పష్టం చేశారు. అటువంటి రైతులు ముందుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, రైతులు తమ పంటల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
నమోదు చేసిన పంటల ఆధారంగా, వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు ప్రతి ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా విడతలవారీగా సరఫరా చేయబడుతుంది. మిర్చి రైతులకు సెప్టెంబర్ నెల నుంచి ప్రతి ఎకరానికి ఆరు బస్తాల చొప్పున యూరియాను అందజేస్తారు. రైతులు క్యూ లైన్లలో నిలబడకుండా యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని, నిర్ణీత సమయంలో యూరియా పొందాలని విజ్ఞప్తి చేశారు.












