చర్ల మండలంలో డీజిల్ కొరత ఏర్పడటం తో రైతులు వ్యవసాయ పనులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పొలాలను దున్నడానికి అవసరమైన డీజిల్ లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని ఐదు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటం, కొన్ని బంకులు మూసివేయడం వంటి పరిణామాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర తెలిపారు. ఈ పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రాచలం నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన చర్ల లో డీజిల్ కొరత లేకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీజిలెన్స్ అధికారులు, స్థానిక తహశీల్దార్ వెంటనే స్పందించి, పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, డీజిల్ సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు.
వర్షాకాలం ప్రారంభంతో రైతులు దుక్కులు దున్నే పనులు చేపట్టాల్సి ఉందని, ఈ సమయంలో డీజిల్ కొరత వారిని అయోమయంలో పడేసిందని ఇరప. రాజు దొర అన్నారు. రైతులకు డీజిల్ అందుబాటులో ఉంచడం తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్ బంక్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.










