పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం వద్ద పాపికొండల విహారయాత్రకు వెళ్తున్న పర్యాటక బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
శుక్రవారం ఉదయం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి 89 మంది పర్యాటకులతో ఒక బోటు పాపికొండల వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే, దేవీపట్నం పాత పోలీసుస్టేషన్ ప్రాంతానికి సమీపంలో బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బోటు అక్కడే నిలిచిపోయింది.
సమాచారం అందిన వెంటనే, కంట్రోల్ రూం అధికారులు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే 'జలశ్రీ' అనే మరో బోటును సంఘటనా స్థలానికి పంపించి, అందులోని పర్యాటకులను సురక్షితంగా తరలించారు. ఈ చర్యలతో పర్యాటకుల విహారయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూశారు.
జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ మాట్లాడుతూ, బోటు ఇంజిన్‌లోని సాఫ్ట్ బేరింగ్ బిగుతుగా మారడమే సమస్యకు కారణమని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ, తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఈరోజు బయలుదేరిన రెండు పర్యాటక బోట్లు సురక్షితంగా తిరిగి వస్తున్నాయని ఆయన ధృవీకరించారు.
ఈ సంఘటన అనంతరం, పర్యాటకుల భద్రతపై, ముఖ్యంగా లైఫ్ జాకెట్ల లభ్యతపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, పర్యాటక బోట్లలో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని కోరుతున్నారు.








